బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి కేటీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్, మేడిగడ్డ బ్యారేజి సందర్శించి వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ, “కేసీఆర్ పంచభక్ష పరమాన్నలను ప్లేట్లో పెట్టి అందిస్తే ఎలా వాడుకోవాలో తెలీని పరిస్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది.
ఎగువ నుంచి 10.60 లక్షల క్యూసెక్కుల నీరు పారుతున్నా మేడిగడ్డ బ్యారేజికి ఎటువంటి ముప్పు కలుగలేదు. కేవలం 30 వేల క్యూసెక్కులు నీళ్ళు ఉంటే చాలు కన్నెపల్లి పంప్ హౌస్ మోటర్లను ఆన్ చేసి నీళ్ళు ఎగువన ఉన్న జలాశాయలలోకి ఎత్తిపోసుకోవచ్చని ఇంజనీర్లు చెపుతున్నారు. ఇప్పుడు 10.60 లక్షల క్యూసెక్కుల నీరు పారుతున్నా కన్నెపల్లి పంప్ హౌస్ మోటర్లు ఆన్ చేయకుండా, వరద నీటిని దిగువకు వదిలేసి వృధా చేస్తోందీ ప్రభుత్వం.
కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని ఎత్తిపోసి రైతులకు నీళ్ళు అందిస్తే కేసీఆర్కు మంచి పేరు వస్తుందనే అసూయతోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీటిని ఎత్తిపోయకుండా వదిలేస్తోంది. రాజకీయ కక్షలతో రైతులకు అన్యాయం చేయవద్దని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను.
కనుక తక్షణమే కన్నెపల్లి కన్నెపల్లి పంప్ హౌస్ మోటర్లు ఆన్ చేసి ఎగువన ఉన్న ఎల్లంపల్లి, శ్రీరాంసాగర్, మిడ్ మానేరు, ఎల్ఎండీ, కొండపోచమ్మ, మల్లన్నసాగర్, నిజాంసాగర్ జలాశయాలకు నీటిని ఎత్తిపోస్తే 100 టీఎంసీల నీళ్ళు నిలువ చేసుకోవచ్చు. అన్నారం, సుందిళ్ళలో నీటిని నిలువ చేయవద్దని నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆధారిటీ చెప్పిందని అబద్దాలు చెపుతూ రైతులను అన్యాయం చేయవద్దు.
కనుక తక్షణమే కన్నెపల్లి పంప్ హౌస్ మోటర్లను ఆన్ చేసి నీళ్ళు ఎగువన ఉన్న జలాశాయలలోకి ఎత్తిపోయడం ప్రారంభించాలని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. లేకుంటే శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాత ఆగస్ట్ 2 తర్వాత మేమే కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న 50 వేల మంది రైతులను వెంటబెట్టుకొని వచ్చి మోటర్లు ఆన్ చేసి నీళ్ళు ఎత్తిపోసుకుంటాము,” అని కేటీఆర్ హెచ్చరించారు.