బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు విహారయాత్రకు వెళ్ళారు!

బిఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్ళిరావడాన్ని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విహారయాత్రగా అభివర్ణించారు. కేటీఆర్‌, హరీష్ రావులకు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన తప్పులు తెలిసి ఉన్నా వాటిని కప్పి పుచ్చుకునేందుకే విహారయాత్ర చేసి వచ్చి తమ ప్రభుత్వాన్ని నిందిస్తున్నారని జీవన్ రెడ్డి ఆరోపించారు.  

రూ.30,000 కోట్లతో మూడు లిఫ్టులు ఏర్పాటు చేస్తే పూర్తయ్యే కాళేశ్వరం ప్రాజెక్టుని కేసీఆర్‌ కమీషన్లకు కక్కుర్తిపడి రూ.1.20 లక్షల కోట్లు ఖర్చు చేశారని జీవన్ రెడ్డి ఆరోపించారు. ఇంత ఖర్చు చేసి నిర్మించినా నేడు వరద నీటిని నిలువచేయలేని దుస్థితి నెలకొందని అన్నారు.

తమ నిర్వాకం వలననే ఇంత నష్టం, ఇంత భారీగా అప్పులు అయినా కేటీఆర్‌ ఎమ్మెల్యేలను వెంటబెట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టుని సందర్శించి రావడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్ రావు ముగ్గురూ ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు జరిగాయని ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పుకోవాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. 

కానీ కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ, “ప్రాజెక్టులో నీళ్ళు ఉన్నప్పటికీ రైతులకు నీళ్ళు విడుదల చేయకుండా చేస్తూ ఇబ్బంది పెడుతోంది. ప్రభుత్వం ఇప్పటికైనా నీటిని విడుదల చేయకపోతే మేమే 50 వేల మంది రైతులతో కలిసి వెళ్ళి పంపులు ఆన్‌ చేసి నీళ్ళు పారించుకుంటాము,” అని హెచ్చరించారు.