మాజీ సిఎం, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ నేడు తొలిసారిగా శాసనసభ బడ్జెట్ సమావేశానికి హాజరయ్యారు. ఆర్ధికమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత కేసీఆర్ తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ, “ఇదో అర్భక ప్రభుత్వం... దిక్కుమాలిన బడ్జెట్. ఇది బడ్జెట్‌లా లేదు ఏదో సినిమా కధలా ఉంది. బడ్జెట్లో విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులు తదితర అంశాలపై ప్రభుత్వ విధానాల ప్రస్తావన లేదు. సంక్షేమ పధకాల ఊసే లేదు.
దళిత బంధు, గొర్రెల పంపిణీ పధకం ప్రస్తావన లేదు. కొత్త పధకాలను, కొత్త విధానాలను ప్రకటించకపోగా కనీసం రైతు బంధు, రైతు భరోసా గురించి ఏమీ చెప్పలేదు. మేము అమలుచేసిన పధకాలను కూడా ఈ ప్రభుత్వం కొనసాగించలేకపోతోంది.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను, రైతులను మోసం చేస్తుందని నేను మొదటి నుంచే చెపుతున్నాను. ఇప్పుడు అదే చేసింది. బడ్జెట్ పేరుతో శాసనసభలో కాకమ్మ కధలు చెపితే సరిపోతుందనుకున్నారు. వీళ్ళకి ప్రభుత్వం నడపడం చేతకాదు. ఈ బడ్జెట్‌ని మేము చీల్చి చెండాడుతాము,” అని కేసీఆర్ తేల్చిపడేశారు. కేసీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మంత్రులు ఏవిదంగా స్పందిస్తారో చూడాలి.