కేటీఆర్‌ గుర్తు చేస్తేగానీ ఫ్లైఓవర్‌కి మోక్షం కలగలేదే!

బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఒక్క హైదరాబాద్‌ నగరంలోనే దాదాపు 30కిపైగా ఫ్లైఓవర్లు నిర్మించింది. వాటిలో గోపనపల్లి ఫ్లైఓవర్‌ కూడా ఒకటి. 

రూ.28.5 కోట్ల వ్యయంతో రెండు వరుసలతో కిలో మీటర్ పొడవుతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్‌ ద్వారా హైదరాబాద్‌ యూనివర్సిటీ నల్లగండ్ల వైపు గల వెనుక గేటు వైపు చేరుకోవచ్చు. రెండో ఎగ్జిట్ ద్వారా తెల్లాపూర్ చేరుకోవచ్చు. ముఖ్యంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైపు నిత్యం రాకపోకలు సాగించే వేలాది వాహనాలకు టు అవుటర్ రింగ్ రోడ్ వైపు వెళ్ళే వాహనాలకు ఈ ఫ్లైఓవర్‌ ఉపయోగపడేలా నిర్మించారు. 

ఈ ఫ్లైఓవర్‌ నిర్మాణం ఎప్పుడో పూర్తయినప్పటికీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికల కారణంగా ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. ఎన్నికలు ముగిసి రెండు నెలలవుతున్నా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ ఫ్లైఓవర్‌ని ప్రారంభోత్సవం చేయకపోవడాన్ని మాజీ మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్తగా ఏమీ నిర్మించలేకపోతున్నా, కనీసం తాము నిర్మించిన ఫ్లైఓవర్‌ని ప్రారంభించలేకపోతోందని వ్యంగ్యంగా విమర్శించారు. ఇది మీడియాలో రావడంతో సిఎం రేవంత్‌ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు కలిసి శనివారం ఈ గోపనపల్లి ఫ్లైఓవర్‌కు ప్రారంభోత్సవం చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.