ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ని దర్యాప్తు చేస్తూ సీబీఐ దాఖలు చేసిన కేసులో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యూడీషియల్ కస్టడీపై నేడు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఆమె కస్టడీని ఈ నెల 22వరకు పొడిగించింది. రెండు రోజుల క్రితం ఆమెకు జ్వరం వచ్చి నీరసించిపోవడంతో జైలు అధికారులు ఆమెను దీన్ దయాళ్ ఆస్పత్రిలో చికిత్స చేయించగా కోలుకున్నారు.
ఈరోజు ఆమెను వీడియో కాన్ఫెరెంసింగ్ ద్వారా న్యాయమూర్తి ముందు హాజరు పరిచినప్పుడు ఆమె తరపు న్యాయవాది ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి కోర్టుకి వివరించి ప్రైవేట్ హాస్పిటల్‌లో ఆమెకు వైద్య పరీక్షలు చేయించేందుకు అనుమతి కోరారు.
న్యాయమూర్తి సానుకూలంగా స్పందించారు కానీ ఎయిమ్స్ హాస్పిటల్‌ల్లో ఆమెకు అవసరమైన పరీక్షలన్నీ చేయించాలని ఆదేశించారు. పరీక్షల తాలూకు రిపోర్టు కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు.
కల్వకుంట్ల కవితకు బెయిల్ లభించకపోవడంతో ఆరోగ్య కారణాలతో బెయిల్ పొందాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.