ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణాలపై జస్టిస్ నరసింహా రెడ్డి కమీషన్ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. దానిపై అభ్యంతరం తెలుపుతూ కేసీఆర్ సుప్రీంకోర్టు పిటిషన్ వేశారు.
కమీషన్ అవసరమే లేదని, జస్టిస్ నరసింహా రెడ్డి నిష్పక్షపాతంగా విచారణ జరుపకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకున్నవిదంగా విచారణ జరిపి నివేదిక సిద్దం చేస్తున్నారని కనుక ఆయనను తొలగించి కమీషన్‌ను రద్దు చేయాలని కోరుతూ కేసీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
దానిపై నేడు విచారణ చేపట్టి ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత, ఈ అంశాలపై కమీషన్ విచారణ జరుపుతున్నప్పుడు జస్టిస్ నరసింహా రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడటం సరికాదని, కనుక ఆయన స్థానంలో వేరొకరిని కమీషన్ ఛైర్మన్‌గా నియమించాలని ఆదేశించింది.
దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించి కొత్త ఛైర్మన్ పేరుని తెలియజేస్తామని సుప్రీంకోర్టుకి తెలియజేసింది. అయితే ఈ వివాదాల కారణంగా అంతకు ముందే జస్టిస్ నరసింహా రెడ్డి కమీషన్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రభుత్వానికి తెలియజేశారు.
అయితే కమీషన్ ఛైర్మన్‌ని మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది తప్ప రద్దు చేయాలని ఆదేశించకపోవడం కేసీఆర్‌కు చాలా నిరాశ కలిగించేదే అని భావించవచ్చు. కానీ జస్టిస్ నరసింహా రెడ్డి స్థానంలో కొత్త వ్యక్తిని కమీషన్ ఛైర్మన్‌గా నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశించినందున కమీషన్ విషయంలో తన వాదనలు నిజమే అని తేలిందని గొప్పగా చెప్పుకునే అవకాశం కేసీఆర్‌కి కలిగింది.