తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పధకంలో భాగంగా రాష్ట్రంలో మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా బస్సులలో ఉచితంగా ప్రయాణించేందుకు వీలు కల్పించింది. ఏపీలో టిడిపి, జనసేన, బీజేపీల కూటమి కూడా ఎన్నికలలో ఇటువంటి హామీయే ఇచ్చింది. కనుక ఏపీలో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని నానాటికీ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది.
ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో పర్యటించి ఈ పధకం అమలవుతున్న తీరు దానిలో సాదకబాధకాలను అధ్యయనం చేసి వెళ్ళారు. వారి నివేదిక ఆధారంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా ఆగస్ట్ 15నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే దీనికి సంబందించి మార్గదర్శకాలు విడుదల చేస్తామని ఏపీ రవాణా శాఖ మంత్రి చెప్పారు.
అయితే ఈ పధకం వలన ఆర్టీసీ భారీగా ఆదాయం కోల్పోతుంది కనుక ఆ భారం కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. కనుక కొన్ని పరిమితులు లేదా షరతులతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.