ఇక కేసీఆర్‌ని జైలుకి పంపడం ఒక్కటే బాకీ: రాజగోపాల్ రెడ్డి

దాదాపు రెండున్నర దశాబ్ధాల పాటు తెలంగాణ రాజకీయాలను కంటిచూపుతో శాసించిన కేసీఆర్‌ని ఇప్పుడు ప్రతీ ఒక్కరూ వేలెత్తి చూపుతూ విమర్శిస్తున్నారు. కేసీఆర్‌ తనను తాను చాలా గొప్పగా ఊహించుకుంటున్నారే తప్ప బయట ఆయన గురించి చాలా మందికి దురాభిప్రాయం ఉందని స్పష్టం అవుతోంది.

పార్టీని వీడి వెళ్లిపోతున్నవారే కాదు కాంగ్రెస్‌ నేతలు కూడా కేసీఆర్‌ని వేలెత్తి చూపుతూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. 

మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈరోజు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “నా మొదటి లక్ష్యం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో నెరవేరింది. ఇక కేసీఆర్‌ని జైలుకి పంపిస్తే నా రెండో లక్ష్యం కూడా నెరవేరుతుంది. కేసీఆర్‌, కేటీఆర్‌ ఇద్దరూ ఏదో ఓ రోజు జైలుకి పోక తప్పదు.

జగదీష్ రెడ్డి కూడా జైలుకి పోతాడు. జైలుకి పోయే అటువంటి నాయకులకు మా కాంగ్రెస్ పార్టీలో చోటు లభించదు. కేసీఆర్‌ మా ప్రభుత్వాన్ని కూలగొట్టడం కాదు ముందు తన పార్టీ కనుమరుగు కాకుండా కాపాడుకుంటే మంచిది,” అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.