ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కల్వకుంట్ల కవితకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో మళ్ళీ నిరాశ తప్పలేదు. ఆమె బెయిల్ పిటిషన్‌పై తదుపరి విచారణను జూలై 22కి వాయిదా పడింది. కనుక అప్పటి వరకు తిహార్ జైల్లో ఉండక తప్పదు.
సీబీఐ అధికారులు కల్వకుంట్ల కవితని మార్చి 15న హైదరాబాద్‌లో ఆమె నివాసం నుంచి అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకువెళ్లారు. అప్పటి నుంచి అంటే దాదాపు 4 నెలలుగా తిహార్ జైల్లోనే ఉంటున్నారు. ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ లభిస్తుందని ఆశించగా, ఈ కేసు తదుపరి విచారణ 22కి వాయిదా పడింది.
ఈకేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌లో చాలా తప్పులున్నాయని, కల్వకుంట్ల కవితకు బెయిల్ లభించకుండా అడ్డుకునేందుకు సీబీఐ ఉద్దేశ్యపూర్వకంగానే తప్పులతో ఛార్జ్ షీట్ దాఖలు చేసిందని, తద్వారా కల్వకుంట్ల కవిత బెయిల్ పొందేందుకు గల హక్కుకి భంగం కలిగిందని ఆమె తరపు న్యాయవాది నితీశ్ రాణా వాదించారు.
తప్పులు తడకలతో ఉన్న ఛార్జ్ షీట్ ఆధారంగా కల్వకుంట్ల కవితపై కేసు విచారణ జరపడం సరికాదని, కనుక ఆమెకు బెయిల్ మంజూరు చేసే విషయంలో ఆ ఛార్జ్ షీట్‌ని పరిగణనలోకి తీసుకోరాదని నితీశ్ రాణా వాదించారు.
కానీ సీబీఐ న్యాయవాది వాటిని ఖండించారు. ఛార్జ్ షీట్‌లో ఎటువంటి తప్పులు లేవని స్పష్టం చేశారు. ఒకవేళ తప్పులు ఉన్నట్లు భావిస్తే వాటిని పేర్కొంటూ కోర్టు ఆర్డర్ ఫైల్ చేయాలని నితీశ్ రాణాను ఆదేశిస్తూ ఈ కేసు తదుపరి విచారణను జూలై 22కి వాయిదా వేస్తున్నాట్లు న్యాయమూర్తి కావేరీ భవేజా ప్రకటించారు.