
బిఆర్ఎస్ పార్టీ నుంచి మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేయబోతున్నారు. రాజేంద్ర నగర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ, “స్వామివారిని దర్శించుకున్న తర్వాత నేను కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాను. నా రాజకీయ గురువు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం నాకు చాలా సంతోషం కలిగిస్తోంది. రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రెండు తెలుగు రాష్ట్రాలు అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తాయని ఆశిస్తున్నాను,” అని చెప్పారు.
ప్రకాష్ గౌడ్ తిరుమల నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత శుక్రవారం సాయంత్రం లేదా రాత్రి సిఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం.
ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అందువల్ల నియోజకవర్గంపై ఆయనకు మంచి పట్టు ఉంది. కనుక అటువంటి బలమైన నేతని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే పార్టీ మరింత బలపడుతుందని సిఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ప్రకాష్ గౌడ్‌తో పాటు కొంతమంది బిఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది.