బడ్జెట్‌ సమావేశాలలోగానే బిఆర్ఎస్ ఖాళీ: దానం నాగేందర్

ఇటీవల బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “మరో రెండు వారాల్లో మరో ఆరుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. బహుశః ఈ నెల 24న తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు మొదలయ్యేలోగానే బిఆర్ఎస్ ఎల్పీ విలీనం కావచ్చు. ఆ తర్వాత బిఆర్ఎస్ పార్టీలో కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్ రావు మరో ఒకరిద్దరు తప్ప మరెవరూ మిగలకపోవచ్చు. 

ఆత్మగౌరవం కలవారు ఎవరూ బిఆర్ఎస్ పార్టీలో ఉండలేరు. పలువురు ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరుతుండగా, మరికొందరు కేసీఆర్‌ ధోరణిని భరించలేక పార్టీని వీడుతున్నారు,” అని అన్నారు. 

దానం నాగేందర్ చేసిన తాజా వ్యాఖ్యలతో బిఆర్ఎస్ పార్టీలో కలకలం మొదలైంది. నేడు కాకపోతే రేపైనా ఒకరొకరుగా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోతారని కేసీఆర్‌ గ్రహించే ఉంటారు. కానీ శాసనసభ సమావేశాలకు ముందు పార్టీ ఖాళీ అయిపోతుందని ఊహించి ఉండరు. 

ఇప్పటికే చాలా మంది బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు కనుక  దానం నాగేందర్ మాటలను ‘మైండ్ గేమ్’ అని కొట్టిపడేయలేరు కూడా. కనుక బిఆర్ఎస్‌ని వీడబోతున్న ఆ ఆరుగురు ఎమ్మెల్యేలు ఎవరు? అని కేసీఆర్‌, కేటీఆర్‌ ఆరా తీస్తున్నారు.