కాంగ్రెస్‌ ధోరణిలో మార్పు వచ్చిందా?

తెలంగాణ శాసనసభ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు సమీక్షా సమావేశాలు ఎప్పుడో ముగించేసుకున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా లోక్‌సభ ఎన్నికలపై విచారణ జరుపుతూనే ఉండటం విశేషం. ఈసారి లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్, మిత్రపక్షాలు అనూహ్యంగా 234 సీట్లు గెలుచుకున్నాయి. వాటిలో 99 సీట్లు కాంగ్రెస్ పార్టీవే. గత రెండు లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే ఈసారి సత్ఫలితాలు సాధించిన్నట్లే భావించవచ్చు. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 8 ఎంపీ సీట్లు గెలుచుకొని బలం పుంజుకుంది. 

అయినా తెలంగాణతో సహా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్‌, ఒడిశా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో ఆశించిన స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఎంపీ సీట్లు గెలుచుకోలేకపోయిందని ఆరా తీస్తుండటం గమనిస్తే కాంగ్రెస్‌ అధిష్టానం ఆలోచనా విధానం, పనితీరులో మార్పు వచ్చిన్నట్లే అనిపిస్తోంది.  

కురియన్, హుసేన్, పర్గత్ సింగ్‌లతో కూడిన కాంగ్రెస్‌ కమిటీ నేడు హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఓడిపోయిన ఎంపీ అభ్యర్ధులతో భేటీ అయ్యి వారి ఓటమికి కారణాలు తెలుసుకుంటోంది.  ఈ కమిటీలు అందరితో మాట్లాడినా తర్వాత కాంగ్రెస్‌ అధిష్టానానికి తమ నివేదికలు సమర్పిస్తాయి. వాటి ద్వారా లోపాలను గుర్తించి సరిచేసుకునేందుకు వీలు కలుగుతుంది.