హైదరాబాద్‌ తిరిగి వచ్చేదేలే: ప్రభాకర్ రావు

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పెషల్ ఇంటలిజన్స్ బ్యూరో మాజీ అధినేత ప్రభాకర్ రావు క్యాన్సర్ చికిత్స కొరకు అమెరికా వెళ్ళి ఆరేడు నెలలవుతోంది. గత నెలలోనే ఆయన హైదరాబాద్‌ తిరిగి రావలసి ఉండగా ఆయన ఇప్పుడప్పుడే తిరిగి రాలేనంటూ ఈ కేసు విచారణ జరుపుతున్న జూబ్లీహిల్స్‌ పోలీసులకు లేఖ వ్రాశారు.

ఆ లేఖలో ఫోన్ ట్యాపింగ్‌ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని, తనపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తమని పేర్కొన్నారు. తనకు క్యాన్సర్ చికిత్సతో పాటు ఇప్పుడు గుండె సంబంధిత చికిత్స కూడా జరుగుతున్నందున తక్షణమే హైదరాబాద్‌ తిరిగి రాలేనని, తన ఆరోగ్యం పూర్తిగా కుదటపడిన తర్వాతే తిరిగివస్తానని ప్రభాకర్ రావు లేఖలో పేర్కొన్నారు.

ఈ కేసులో ఆయనే ప్రధాన నిందితుడని పేర్కొంటూ జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. కనుక ఈ కేసు విచారణకు హాజరవ్వాల్సిందిగా ప్రభాకర్ రావుకి నోటీస్‌ కూడా పంపారు. కానీ హైదరాబాద్‌ తిరిగి వస్తే అరెస్ట్ చేస్తారనే భయంతో ఆయన వైద్య చికిత్స పేరుతో వీలైనంత కాలం అమెరికాలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నట్లు అర్దమవుతోంది. కనుక జూబ్లీహిల్స్‌ పోలీసులు రెడ్ కార్నర్ నోటీస్‌ జారీ చేసి ఆయన అరెస్టు చేసి హైదరాబాద్‌ తిరిగి రప్పించే అవకాశం ఉంది.