రెండు రోజుల క్రితమే కే కేశవ రావు తన రాజ్యసభ సీటుకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 24 గంటలలోగా ఆయనకు మళ్ళీ క్యాబినెట్ హోదాతో కీలక పదవి లభించడం విశేషం. ఆయనను ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు)గా నియమిస్తూ సిఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
కేకేగా చిరపరిచుతులైన కే కేశవ్ రావుకి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పిసిసి అధ్యక్ష పదవితో సహా అనేక కీలక పదవులు దక్కాయి. పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలకు పార్టీ ఇన్‌చార్జిగా పనిచేశారు. మూడుసార్కు మంత్రిగా చేశారు. మండలి ఛైర్మన్‌గా వ్యవహరించారు. ఇంకా పార్లమెంట్‌లో పలు స్టాండింగ్ కమిటీలలో సభ్యుడుగా పనిచేశారు.
రాజకీయాలలో ప్రవేశించక ముందు ఉపాధ్యాయుడుగా, జర్నలిస్టుగా, పలు పత్రికలు సంపాదకుడుగా, నటుడుగా, సినీ నిర్మాతగా వ్యవహరించినందున వివిద రంగాలలో అపారమైన అనుభవం కలిగి ఉన్నారు. తెలంగాణ ఉద్యమాలలో పాల్గొనేందుకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 2013లో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. కేసీఆర్ ఆయనను పార్టీ సెక్రెటరీ జనరల్‌గా నియమించి, రాజ్యసభ సీటు కూడా ఇచ్చి గౌరవించారు. అయితే మారిన రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆయన తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. చేరిన 24 గంటలలోగానే క్యాబినెట్ మంత్రి హోదా కలిగిన సలహాదారు పదవి సంపాదించుకున్నారు.