రేవంత్‌ ప్రభుత్వాన్ని కూల్చబోతే.....

బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ పార్టీ నేతలకు ఎంతగా నచ్చజెపుతున్నప్పటికీ ఆయన మాటలను ఎవరూ పట్టించుకోవడం లేదు. 

గురువారం అర్ధరాత్రి ఒకేసారి ఆరుగురు బిఆర్ఎస్‌ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. సిఎం రేవంత్‌ రెడ్డి ఢిల్లీ నుంచి అర్ధరాత్రి హైదరాబాద్‌లో తన నివాసానికి చేరుకునే వరకు అందరూ ఓపికగా ఎదురుచూసి మరీ వెళ్ళి కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు. 

కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు వీరే: బస్వరాజు సారయ్య, దండే విఠల్, యెగ్గే మల్లేశం, భాను ప్రసాదరావు, ప్రభాకర్ రావు, బొగ్గారపు దయానంద్. 

రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని సిఎం నివాసానికి ముందే చేరుకొని రేవంత్‌ రెడ్డి రాగానే ఆరుగురు ఎమ్మెల్సీలను రప్పించి కాంగ్రెస్‌ కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు. 

రేపటి నుంచి ఆషాడమాసం మొదలవుతుండటంతో బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు కారు దిగేందుకు తొందరపడగా, త్వరలో శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు మొదలవబోతున్నందున కాంగ్రెస్‌ కూడా వారిని చేర్చుకోవడానికి ఆలస్యం చేయలేదు.  

దీంతో బిఆర్ఎస్ పార్టీకి మండలిలో కూడా సంఖ్యాబలం ఆ మేరకు తగ్గిపోగా, కాంగ్రెస్‌ సభ్యుల సంఖ్య 12కి చేరింది. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేసి మళ్ళీ అధికారం చేజిక్కించుకోవాలని కేసీఆర్‌ అనుకుంటే, ఆ భయంతోనే రేవంత్‌ రెడ్డి కూడా బిఆర్ఎస్ పార్టీని మరింత వేగంగా ఖాళీ చేసేస్తున్నారని చెప్పవచ్చు.