రాష్ట్రంలో మళ్ళీ పండుగల సీజన్ వచ్చేస్తోంది. ఆషాడ మాసంలో బోనాల పండుగతో మళ్ళీ వరుస పండుగలు మొదలవుతాయి. ఈఏడాది జూలై 7వ తేదీ నుంచి బోనాల పండుగ వేడుకలు ప్రారంభం కాబోతున్నాయి. కనుక ఎప్పటిలాగే రాష్ట్ర ప్రభుత్వం బోనాల పండుగకు ఏర్పాట్లు చేయబోతోంది.
రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ శనివారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కార్యాలయంలో వివిద శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యి ఏర్పాట్ల గురించి చర్చించారు.
బోనాల పండుగని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి రూ.25 కోట్లు విడుదల చేయిస్తానని చెప్పారు. కనుక జీహెచ్‌ఎంసీ, రవాణా, వైద్య, విద్యుత్, సాంస్కృతిక, పోలీస్ తదితర శాఖల అధికారులందరూ సమన్వయంతో పనిచేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని మంత్రి కొండా సురేఖ సూచించారు.
ఈసారి నగరంలోని 28 అమ్మవారి ఆలయాలలో ప్రభుత్వం తరపున తొమ్మిది మంది మంత్రులతో అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తామని మంత్రి కొండా సురేఖ చెప్పారు. త్వరలోనే బోనాల పండుగ క్యాలండర్, పోస్టర్ విడుదల చేస్తామని చెప్పారు.
ఈ సమావేశంలో రవాణా శాఖ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, టిజిఎస్‌ఆర్టీసీ, పోలీస్ తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.