తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లే, ఇప్పుడు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు కొత్తగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
టిడిపి కూటమి కూడా ఎన్నికల మ్యానిఫెస్టోలో ఈ హామీ ఇవ్వడంతో దీని అమలులో సాధక బాధకాలపై ఏపీఎస్ఆర్టీసీ అధికారులు తెలంగాణలో పర్యటించి అధ్యయనం చేస్తున్నారు. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం వలన ఎటువంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దీని వలన టిజిఎస్ఆర్టీసీపై ఎంత ఆర్ధిక భారం పడుతోంది? రాష్ట్ర ప్రభుత్వం ఎంత భరిస్తోంది? వంటి వివరాలపై అధ్యయనం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి ఎం. రాంప్రసాద్ రెడ్డి శనివారం ఉదయం కడపలో విజయదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలలో పాల్గొన్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ, “ఏపీఎస్ఆర్టీసీ అధికారుల అధ్యయనం చేసి నివేదిక ఇచ్చిన తర్వాత దానిపై మంత్రివర్గంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటాము. త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తాము,” అని చెప్పారు.