బిఆర్ఎస్ హయాంలో ఛత్తీస్‌ఘడ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందం, టెండర్లు పిలవకుండా యాదాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మాణ బాధ్యతలు బీహెచ్ఈఎల్ సంస్థకు అప్పగించడంపై తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ట్ నరసింహా రెడ్డి కమీషన్ చేత విచారణ జరిపిస్తున్న సంగతి తెలిసిందే. వాటిపై కమీషన్ కేసీఆర్‌కి నోటీస్ పంప్ ఈ నెల 15వ తేదీలోగా తమ ఎదుట హాజరయ్యి వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
తాజాగా గొర్రెల పధకంలో కూడా సుమారు రూ.700 కోట్ల మేర అవినీతి జరిగిందంటూ ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో ఈడీ కూడా కేసీఆర్‌కు నోటీస్ ఇచ్చిన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో బిఆర్ఎస్ పార్టీలో కలవరం మొదలైంది.
ఈ నేపధ్యంలో బిఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుచేయలేకనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈవిదంగా ప్రజల దృష్టి మళ్ళించేందుకు ప్రయత్నిస్తోంది. విద్యుత్ కొరత, కోతలతో అల్లాడిపోతున్న తెలంగాణ రాష్ట్రానికి ఎంత ఖర్చు అయినా భరించి విద్యుత్ అందించి రాష్ట్రంలో వెలుగులు నింపినందుకా లేదా తెలంగాణ రైతాంగానికి 24 గంటలు ఉచిత విద్యుత్ అందించినందుకా కేసీఆర్‌కు నోయిటీసులు ఇస్తున్నారు?
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్ళీ విద్యుత్ కోతలు మొదలైపోయాయి. దమ్ముంటే కేసీఆర్‌లాగా 24 గంటలు విద్యుత్ సరఫరా చేసి చూపాలని సవాలు విసురుతున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి కేసీఆర్‌ని ఏదో విధంగా బద్నామ్ చేయాలనే ప్రయత్నిస్తోంది తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుచేయలేకపోతోంది.
గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డికి పాలన చేతకాక ఈవిదంగా ప్రతీకార రాజకీయాలతో కాలక్షేపం చేస్తున్నారు. మాపై దృష్టి పెట్టే బదులు ముందు పరిపాలన, రాష్ట్రాభివృద్ధి, హామీల అమలుపై దృష్టి పెడితే బాగుంటుంది. మీ చాతగానితనానికి రాష్ట్రాన్ని, ప్రజలను బలిచేయవద్దని కోరుతున్నాము,” అని అన్నారు. ఈ మేరకు దాసోజు తెలంగాణ ప్రభుత్వానికి ఓ బహిరంగ లేఖ కూడా వ్రాశారు.