
ఇరుగు పొరుగు రాష్ట్రాలలో నామ మాత్రపు ధరలకే పేద ప్రజలకు ఫలహారాలు, భోజనం అందించే క్యాంటీన్లను ఆయా ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ అధ్వర్యంలో కూడా అటువంటి క్యాంటీన్లు ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 150 మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
రాష్ట్రంలో మహిళా సంఘాలను ఆర్ధికంగా బలోపేతం చేయాలనే సిఎం రేవంత్ రెడ్డి ఆదేశం మేరకు సంబంధిత శాఖల అధికారులు ఇరుగు పొరుగు రాష్ట్రాలలో పర్యటించి అక్కడ నడుస్తున్న క్యాంటీన్ల నిర్వహణ, సమస్యలు, ఏర్పాట్లపై అధ్యయనం చేసి వచ్చారని ప్రభుత్వ కార్యదర్శి శాంతి కుమారి చెప్పారు. వారి సలహాలు సూచనలతో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ కార్యాలయాలు, ఆర్టీసీ బస్టాండ్లు, పారిశ్రామికవాడలు, పర్యాటక ప్రాంతాలు, ఇంకా జనం ఎక్కువగా ఉండే ప్రాంతాలలో మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని శాంతి కుమారి తెలిపారు.
గురువారం సచివాలయంలో జరిగిన ఈ అంశంపై జరిగిన సమావేశంలో వివిద శాఖల ఉన్నతాధికారులకు మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటుకు అవసరమైన స్థలం వగైరా కేటాయింపు, వాటి నిర్వహణ, పర్యవేక్షణ తదితర అంశాలపై సమగ్ర ప్రణాళిక సిద్దం చేయమని సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు.