మొన్న గన్నవరంలో చంద్రబాబు నాయుడు, మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె వేదికపై ఉన్న కేంద్ర మంత్రులకు నమస్కరించి ముందుకు సాగుతుంటే అమిత్ షా ఆమెను వెనక్కు పిలిచి సీరియస్గా ఏదో చెప్పారు.
ఆయన ఏమి చెప్పారో ఎవరూ వినలేదు కానీ ఆయన అంతా గంభీరంగా మొహం పెట్టుకొని ఆమెతో ఏదో మాట్లాడుతున్నప్పుడు అక్కడే ఉన్న మీడియా ఫోటోలు, వీడియోలు తీసి, ఆమెకు అమిత్ షా వార్నింగ్ ఇచ్చారంటూ ఊహించుకొని వ్రాసేశారు.
తమిళనాడు ఎన్నికలలో ఆమె, బీజేపీ కూడా ఓడిపోయిన తర్వాత ఆమె ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామాలైపై తీవ్ర విమర్శలు చేశారు. ఇదే విషయంపై అమిత్ షా ఆమెకు వార్నింగ్ ఇచ్చారంటూ మీడియాలో వార్తలు వచ్చాయి.
అవి ఆమె దృష్టికి రావడంతో వాటిపై ఆమె స్పందిస్తూ, “తమిళనాడులో ఎన్నికల తర్వాత పరిణామాలు, ఎదుర్కొన్నా సవాళ్ళ గురించి అమిత్ షా నన్ను వివరణ అడిగారు. నేను ఆయనకు అదే విషయాలు వివరిస్తుంటే, సమయాభావం వలన ఈ విషయంపై ఎక్కువగా మాట్లాడలేము కనుక మళ్ళీ నియోజకవర్గంలో రాజకీయాలపై దృష్టి పెట్టి గట్టిగా పనిచేయమని ఆయన నాకు సూచించారు. మా సంభాషణపై వస్తున్న అనవసరమైన ఊహాగానాలను వినిపిస్తున్నాయి. అందుకే ఈ వివరణ ఇస్తున్నాను,” అంటూ ట్వీట్ చేశారు.