నటి హేమకు బెయిల్ మంజూరు

బెంగళూరు రేవ్ పార్టీలో మాదకద్రవ్యాలు తీసుకునందుకు అరెస్ట్ అయిన ప్రముఖ నటి హేమకు స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఆమెకు 14 రోజులు జ్యూడిషియల్ రిమాండ్‌ విధించగా ఆమె బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. బుధవారం ఆమె బెయిల్‌ పిటిషన్‌పై స్థానిక కోర్టు విచారణ జరిపి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. 

గత నెల 19వ తేదీన బెంగళూరు శివారులో ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్న వారిలో ఆమె కూడా ఒకరు. రేవ్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న బెంగళూరు క్రైమ్ కంట్రోల్ పోలీసులు ఫామ్‌హౌస్‌పై దాడి చేసి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వందమందికి పైగా వ్యక్తులను అదుపులో తీసుకుని, వారి పేర్లు, ఫోన్ నంబర్లు, చిరునామాలు, రక్త నమూనాలు తీసుకొని పంపించేశారు. వారిలో నటి హేమతో సహా మొత్తం 89 మంది మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు గురించి అందరికీ నోటీసులు ఇచ్చారు. 

నటి హేమ మొదట బుకాయించినప్పటికీ బెంగళూరు క్రైమ్ పోలీసులు ఆధారాలు చూపి ఆమెను అరెస్ట్ చేసి జ్యూడిషియల్ రిమాండ్‌పై జైలుకి పంపారు. ఆమె ప్రయత్నాలు ఫలించి బెయిల్ లభించడంతో ఈరోజు ఆమె హైదరాబాద్‌ చేరుకున్నారు.