
రెవెన్యూ అధికారులు మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి ఈరోజు షాక్ ఇచ్చారు. నగరంలో సుచిత్ర క్రాస్ రోడ్స్ పరిధిలో సర్వే నంబర్ 82లో ఉన్న రెండున్నర ఎకరాల భూమిని సర్వే చేసి దానిలో 33 గుంటల భూమిని మల్లారెడ్డి కబ్జాలో ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. తమ సర్వే నివేదికని తదుపరి విచారణ కొరకు హైకోర్టుకు, సైబరాబాద్ పోలీసులకు అందజేశారు.
సర్వే నంబర్ 82లో మొత్తం రెండున్నర ఎకరాల భూమి ఉంది. దానిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌తో సహా మరో 14 మంది 400 గజాల చొప్పున 1.1 ఎకరాలు కొనుగోలు చేశామని, దానిని మల్లారెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు కబ్జా చేశారని ఆరోపిస్తున్నారు. గత నెల 19వ తేదీన వారందరూ కలిసి తమ 1.1 ఎకరాల భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసుకోగా, ఈ విషయం తెలుసుకున్న మల్లారెడ్డి తన అల్లుడు రాజశేఖర్ రెడ్డి, అనుచరులను వెంటబెట్టుకొని వచ్చి ఫెన్సింగ్ ధ్వంసం చేసి వారికి, తమని అడ్డుకోవాలని ప్రయత్నించిన పోలీసులకు కూడా వారింగ్ ఇచ్చారు.
దీంతో కోర్టు ఆదేశం మేరకు రెవెన్యూ అధికారులు ఆ భూమి సర్వే చేసి దానిలో 33 గుంటల భూమిని మల్లారెడ్డి కబ్జా చేశారని తేల్చారు. కనుక ఇప్పుడు మల్లారెడ్డికి కోర్టులో మొట్టికాయలు తప్పకపోవచ్చు.