కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ రేపే బాధ్యతల స్వీకరణ

తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి పదవులు పొందిన బీజేపీ ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ ఇద్దరూ రేపు (గురువారం) ఢిల్లీలో తమతమ కార్యాలయాలలో మంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్నారు.

బొగ్గుశాఖ మంత్రి పదవి చేపట్టిన కిషన్ రెడ్డి ఢిల్లీలోని శాస్త్రి భవన్‌లోలోని తన శాఖ కార్యాలయంలో గురువారం ఉదయం 11 గంటలకు మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. 

కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి పదవి చేపట్టిన బండి సంజయ్‌ కూడా ఇంచుమించు అదే సమయంలో నార్త్ బ్లాక్‌లోని హోమ్ శాఖ కార్యాలయంలో తన ఛాంబర్‌లో బాధ్యతలు చేపట్టనున్నారు. 

ఏపీకి చెందిన రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస వర్మ ముగ్గురూ కూడా రేపు లేదా ఎల్లుండి తమతమ కార్యాలయాలలో బాధ్యతలు చేపట్టనున్నారు. 

ఈరోజు మధ్యాహ్నం 11.30 గంటలకు గన్నవరం సమీపంలో గల కేసరపల్లి వద్ద ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర మంత్రులు, చిరంజీవి, రజనీకాంత్ ఇంకా పలువురు ప్రముఖుల సమక్షంలో చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌లతో సహా 25 మంది ఏపీ ముఖ్యమంత్రి, మంత్రులుగా ప్రమాణస్వీకారాలు చేశారు.