తెలంగాణలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకి సహకరిస్తా!

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఐదుగురు కేంద్రమంత్రులుగా అవడంతో రెండు తెలుగు రాష్ట్రాలకు పరస్పరం లబ్ధి కలిగించుకునే అవకాశం ఏర్పడింది. 

ఏపీ నుంచి టిడిపి ఎంపీగా ఎన్నికై కేంద్ర పౌరవిమానయాన శాఖా మంత్రి పదవి చేపట్టిన కె. రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ, “ఇదివరకు ఎంపీగా కేంద్రమంత్రుల వద్దకు వెళ్ళి వారితో ఏపీకి సంబందించిన పనులు, నిధులు, సమస్యల గురించి మాట్లాడేందుకు వెళుతుండేవాడిని.

ఆ క్రమంలో వారందరితో నాకు మంచి పరిచయాలు, సత్సంబంధాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు నేను కూడా కేంద్రమంత్రి అవడంతో వారి సహచరుడిని అయ్యాను. కనుక అన్ని శాఖల మంత్రుల సహాయసహకారాలు తీసుకొంటూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో నా పరిధిలో అభివృధ్ది పనులన్నీ చేస్తాను. 

ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు చేయాల్సి ఉంది. వాటి కోసం నేను చేయగలిగినంతా చేస్తాను. 

అలాగే రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌, పెమ్మసాని చంద్రశేఖర్, వర్మగారు అందరం కలిసి పరస్పరం సహకరించుకుంటూ రెండు తెలుగు రాష్ట్రాలకు గరిష్టంగా మేలు కలిగేలా చేస్తాము. 

ఏపీకి సంబందించి భోగాపురం విమానాశ్రయం నిర్మాణ పనులను వేగవంతం చేసి పూర్తి చేయిస్తాను. ఇంకా నేను చేయవలసిన పనుల జాబితాని చంద్రబాబు నాయుడు ఇప్పటికే సిద్దం చేసి నా చేతిలో పెట్టారు. వాటిలో ప్రతీ ఒక్కటీ పూర్తి చేసేందుకు గట్టిగా కృషి చేస్తాను,” అని రామ్మోహన్నాయుడు అన్నారు.