తెలంగాణలో కేంద్రమంత్రి పదవి ఎవరికి?

కేంద్రంలో మళ్ళీ ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రావడం, తెలంగాణలో ఈసారి బీజేపీ నుంచి 8 మంది ఎంపీలుగా ఎన్నికవడంతో, వారిలో ఎవరికి కేంద్రమంత్రి పదవి లభిస్తుందనే ఊహాగానాలు మొదలయ్యాయి.

గత ప్రభుత్వంలో కిషన్ రెడ్డికి కేంద్రమంత్రి పదవి లభించింది కనుక ఈసారి వేరే వారికి ఇవ్వాలనుకుంటే, తెలంగాణ మాజీ రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా అనుభవం ఉన్న ఈటల రాజేందర్‌కు లేదా అత్యంత జనాధారణ కలిగిన కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉంది. 

శాసనసభ ఎన్నికలలో బీజేపీని గెలుపు ఖాయం అనే స్థాయికి తీసుకు వచ్చిన బండి సంజయ్‌ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించినందుకు బీజేపీ తీవ్రంగా నష్టపోయింది. రాష్ట్రంలో బీజేపీని ఆ స్థాయికి తీసుకువెళ్ళిన ఆయనను పక్కన పెట్టినందుకు పరిహారం చేసుకోదలిస్తే కేంద్రమంత్రి లేదా సహాయ మంత్రి పదవి అయినా ఇవ్వక తప్పదు. 

నిజామాబాద్‌ నుంచి వరుసగా రెండుసార్లు ఘన విజయం సాధించిన ధర్మపురి అర్వింద్, న్యాయవాది, మంచి వక్తగా పేరున్న రఘునందన్ రావు, ఒకవేళ మహిళలకు అవకాశం ఇవ్వాలనుకుంటే మాజీ మంత్రి డికె అరుణ ముగ్గురున్నారు. 

రేపు ఆదివారం సాయంత్రం నరేంద్ర మోడీ ప్రధాన మంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. కనుక రేపు సాయంత్రంలోగా తెలంగాణ బీజేపీ ఎంపీలలో ఎవరికి కేంద్రమంత్రి లభించబోతోందో తెలిసే అవకాశం ఉంది.