చట్టసభలో అడుగుపెట్టాలనే తీన్మార్ మల్లన కల నెరవేరబోతోంది. వరంగల్-నల్గొండ-ఖమ్మం ఉమ్మడి జిల్లాల పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ బలపరిచిన తీన్మార్ మల్లన ఘన విజయం సాధించారు.
తీన్మార్ మల్లన మొదటి రెండు రౌండ్ల ఓట్ల లెక్కింపులోనే ఆధిక్యత సాధించినప్పటికీ శుక్రవారం అర్దరాత్రి వరకు ఓట్ల లెక్కింపు ఉత్కంఠగానే సాగింది. ఎలిమినేషన్ రౌండ్‌లో బీజేపీ బలపరిచిన ప్రేమేందర్ రెడ్డికి వచ్చిన రెండో ప్రాధ్యాన్యత ఓట్లు లెక్కింపు పూర్తయ్యేసరికి అర్ధరాత్రి అయ్యింది. అప్పటికి కానీ లెక్క తేలలేదు. బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన రాకేశ్ రెడ్డిపై 14,000 మెజార్టీతో తీన్మార్ మల్లన గెలిచిన్నట్లు రిటర్నింగ్ అధికారిణి దాసరి హరిచందన ధృవీకరణ పత్రాన్ని అందజేశారు.
తీన్మార్ మల్లన ఇదివరకు రెండుసార్లు ఎమ్మెల్సీ, ఒకసారి ఎమ్మెల్యే ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయారు. ముచ్చటగా మూడోసారి పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యి మండలిలో అడుగుపెట్టబోతున్నారు.
రాకేశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “నా ఓటమిని అంగీకరిస్తున్నాను. కానీ 32 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఐదుగురు మంత్రులు ఉన్న ఈ మూడు ఉమ్మడి జిల్లాల నియోజకవర్గంలో నేను కాంగ్రెస్ బలపరిచిన తీన్మార్ మల్లనకు గట్టి పోటీ ఇవ్వగలిగాను. సాంకేతికంగా నేను ఓడిపోయినప్పటికీ నైతికంగా గెలిచిన్నట్లే భావిస్తున్నాను. ఈ తృప్తి చాలు నాకు. ఈ ఎన్నికలో విజయం సాధించిన తీన్మార్ మల్లనకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను,” అని అన్నారు.