లోక్‌సభ ఎన్నికల కోడ్ ఎత్తివేస్తూ ఈసీ ప్రకటన

ఏడు దశలలో సాగిన లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ, గెలిచిన అభ్యర్ధుల జాబితా గెజిట్ ముద్రణతో ముగిసింది. కనుక దేశవ్యాప్తంగా గురువారం నుంచి లోక్‌సభ ఎన్నికల కోడ్ ఎత్తివేస్తున్నట్లు ఈసీ ప్రకటించింది.

అయితే తెలంగాణలో వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబందించి ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతున్నందున ఆ ఉమ్మడి జిల్లాలలో మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని తెలిపింది. 

బ్యాలెట్ పేపర్లతో ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించడం, మళ్ళీ వాటిలో ప్రాధాన్యత ఓట్లను లెక్కించవలసి వస్తుండటంతో కౌంటింగ్‌ ప్రక్రియ మెల్లగా సాగుతోంది. ఇప్పటి వరకు పూర్తయిన రెండు రౌండ్లలో కాంగ్రెస్‌ అభ్యర్ధి తీన్మార్ మల్లన ఆధిక్యంలో ఉన్నారు. 

ఈ ఫలితాలు కూడా వెలువడితే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ పూర్తిగా ఎత్తివేయబడుతుంది. కనుక సిఎం రేవంత్‌ రెడ్డి త్వరలో మళ్ళీ మంత్రి వర్గం సమావేశం నిర్వహించి, రైతులకు రూ.2 లక్షల వరకు పంట రుణాల మాఫీ హామీపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఆగస్ట్ 15వ తేదీలోగా ఈ హామీని అమలు చేస్తామని లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కూడా పదేపదే హామీ ఇచ్చారు. కనుక ముందుగా దీనిపై చర్చించి ఆమోదించే అవకాశం ఉంది.