ఈసారి బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలుచుకోవడంతో తెలంగాణ బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, లక్ష్మణ్ తదితరులు చాలా సంతోషంగా ఉన్నారు.
శాసనసభ ఎన్నికలలో ఓడిపోయిన బిఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికలలో పూర్తిగా తుడిచిపెట్టుకు పోవడంతో రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని చెపుతున్నారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయమని బీజేపీ నేతలు చెపుతున్నారు.
శాసనసభ ఎన్నికలలో 8 సీట్లు, లోక్సభ ఎన్నికలలో 8 సీట్లు గెలుచుకున్న తాము 2028లో జరిగే శాసనసభ ఎన్నికలలో 88 సీట్లు గెలుచుకొని రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని కిషన్ రెడ్డి అన్నారు. బిఆర్ఎస్ పార్టీ ‘తెలంగాణ సెంటిమెంట్’ పేరుతో పదేళ్ళు రాజకీయాలు చేసిందని, లోక్సభ ఎన్నికలలో కూడా మళ్ళీ చేయాలని కేసీఆర్ ప్రయత్నించారని కానీ ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించారని అన్నారు.
తెలంగాణ ప్రజలు మోడీ పాలన చూసి బీజేపీకి 8 సీట్లు ఇచ్చి ఇంకా కష్టపడాలని సూచించిన్నట్లు భావిస్తున్నామని కిషన్ రెడ్డి చెప్పారు.
ఇక్కడ తెలంగాణలో బీజేపీ బలం క్రమంగా పెరుగుతుండటం, అక్కడ కేంద్రంలో నరేంద్ర మోడీ మూడవసారి ప్రధానిగా బాధ్యతలు చేపడుతుండటం, పొరుగు రాష్ట్రం ఏపీలో కూడా ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడుతుండటం అన్నీ బీజేపీకి శుభ సూచికలుగా భావిస్తున్నామని కిషన్ రెడ్డి అన్నారు.