కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు నల్గొండలోని దుప్పలపల్లి గోదాములలో బుధవారం ఉదయం ప్రారంభించగా అది ఇంకా కొనసాగుతూనే ఉంది. 

ఈ ఎన్నికలను బ్యాలెట్ పేపర్ల ద్వారా నిర్వహించడం, ప్రాధాన్యత ఓట్లు లెక్కించవలసి వస్తుండటంతో ఓట్ల లెక్కింపుకి చాలా సమయం తీసుకుంటోంది. 

మొదటి రౌండ్ లెక్కింపు పూర్తయ్యేసరికి కాంగ్రెస్‌ అభ్యర్ధి తీన్మార్ మల్లన 7,607 ఓట్ల ఆధిక్యంలో ఉండగా రెండో రౌండ్ ముగిసేసరికి 14,672 ఓట్ల ఆధిక్యంలోకి వచ్చారు. రెండో రౌండులో తీన్మార్ మల్లనకు 34,575, బిఆర్ఎస్‌ అభ్యర్ధి రాకేశ్ రెడ్డికి 27,573, బీజేపీ అభ్యర్ధి ప్రేమేందర్ రెడ్డికి 12,841 ఓట్లు, స్వతంత్ర అభ్యర్ధి అశోక్‌కు 11,018 ఓట్లు వచ్చాయి. 

మూడు ఉమ్మడి జిల్లాలలో ఏర్పాటు చేసిన 605 పోలింగ్‌ బూత్‌లలో మొత్తం 3.36 లక్షల ఓట్లు పోల్ అవగా, వాటిని నాలుగు గదులలో గదికి 24 టెబిల్స్ చొప్పున మొత్తం 96 ఏర్పాటు చేసి లెక్కిస్తున్నారు. ఈరోజు సాయంత్రంలోగా లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది.