లోక్‌సభ ఎన్నికలలో తెలంగాణలోని 17 ఎంపీ సీట్లలో కాంగ్రెస్ పార్టీ 8 సీట్లు గెలుచుకోవడంతో సిఎం రేవంత్ రెడ్డి ఈరోజు సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు.
“తెలంగాణ ప్రజలు శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని నమ్మి 64 సీట్లతో మాకు అధికారం అప్పగించారు. మేము అధికారం చేపట్టిన వంద రోజులలోనే ఐదు హామీలు అమలుచేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. మద్యలో ఎన్నికల కోడ్ రావడం వలన మరికొన్ని హామీలు అమలు చేయలేకపోయాం. ఇక నుంచి వాటన్నిటినీ వరుసగా అమలుచేస్తాం. ఈ 5 నెలల మా పరిపాలన నచ్చితేనే లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయమని ప్రజలను కోరాం.
లోక్‌సభ ఎన్నికలు మా పాలనకు రిఫరెండం అని నేను ప్రకటించినప్పుడు, కొందరు శ్రేయోభిలాషులు, మీడియా మిత్రులు వద్దని వారించారు. ఒకవేళ ఫలితాలు వేరేగా వస్తే రాజకీయంగా ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పారు. కానీ మా ప్రభుత్వ పాలనపై నాకు పూర్తి నమ్మకం ఉంది కనుక ఈ ఎన్నికలను మా పాలనకు గీటురాయనే చెప్పాను.
ప్రజలు మా పాలనపై సానుకూలంగా స్పందించారు కనుక 17 సీట్లలో 8 మాకు ఇచ్చి గెలిపించారు. నిజానికి మరికొన్ని సీట్లు మేము గెలుచుకోవలసి ఉంది. కానీ కేసీఆర్ బీజేపీ కోసం అవయవదానం చేసిన్నట్లుగా 7 సీట్లు బీజేపీకి దక్కేలా చేశారు. ఆ ఏడు స్థానాలలో బిఆర్ఎస్ పార్టీ డిపాజిట్లు కూడా రాకపోవడం గమనిస్తే వాటిని కేసీఆరే బీజేపీ చేతికి అప్పగించిన్నట్లు అర్దమవుతోంది. మెదక్‌లో బీజేపీ అభ్యర్ధిని గెలిపించడానికి హరీష్ రావు చాలా కృషి చేశారు.
అయినప్పటికీ గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి కేవలం 3 ఎంపీ సీట్లు వస్తే ఈసారి అదనంగా మరో 5 కలిపి మొత్తం 8 సీట్లు వచ్చాయి. వాటితో బీజేపీకి 41 శాతం ఓట్లు వచ్చాయి. కనుక మా పాలనకు ప్రజామోదం లభించిన్నట్లే భావిస్తున్నాము,” అని అన్నారు.
ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తే తప్పకుండా హాజరవుతానని రేవంత్ రెడ్డి చెప్పారు. రెండు రాష్ట్రాల మద్య అపరిష్కృతంగా ఉండిపోయిన సమస్యలను పరిష్కరించుకోవాలని నేను కోరుకుంటున్నాను,” అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.