లోక్సభ ఎన్నికలలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 293 సీట్లు సాధించడంతో నరేంద్ర మోడీ ముచ్చటగా మూడవసారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. తమకు ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించవలసిందిగా కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బీజేపీ తరపున లేఖ వ్రాశారు.
ఈ నెల 8వ తేదీ సాయంత్రం ఢిల్లీలోని కర్తవ్య పద్లో నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఎన్డీయేలో భాగస్వాములుగా ఉన్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నితీష్ కుమార్ తదితరులు ఈరోజు ఢిల్లీ చేరుకొని ప్రధాని నరేంద్రమోడీని కలిసి అభినందించనున్నారు.
జూన్ 8వ తేదీన ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వారితో సహా ఎన్డీయే కూటమిలోని మిగిలిన భాగస్వాములు, బీజేపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దేశ విదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుకి 272 ఎంపీల మద్దతు అవసరం ఉండగా, బీజేపీకి సొంతంగా 240 మంది ఉన్నారు. ఎన్డీయే భాగస్వామ్య పార్టీలకు చెందిన మరో 53 మంది కలిపి మొత్తం 293 మంది ఉన్నారు. కనుక పూర్తి మెజార్టీతో మోడీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు.
ఆ తర్వాత జూన్ 9వ తేదీన చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా అమరావతిలో ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులను, ఎన్డీయే భాగస్వామ్య పార్టీల నేతలను ఆహ్వానించనున్నారు.