తెలంగాణలో 17 ఎంపీ సీట్లకు జరిగిన ఎన్నికలు మూడు ప్రధాన పార్టీలలో ఏది గెలిచినా ఓడినా దాంతో తెలంగాణ రాష్ట్రంపై ఎటువంటి ప్రభావం చూపాడు. కానీ ఆ మూడు పార్టీలపై చాలా ప్రభావం చూపబోతోంది.
ఈ ఎన్నికలలో ఏ పార్టీ ఒడితే దానిని మిగిలిన రెండు పారీలు కలిసి దెబ్బ తీసేందుకు కాసుకు కూర్చున్నాయి. కనుక మూడు పార్టీలకు ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. 17 ఎంపీ సీట్లలో కనీసం 10-12 గెలుచుకోవాలని పోటీ పడ్డాయి.కానీ ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్, బీజేపీలకు చెరో 7-9 సీట్లు రావచ్చని, బిఆర్ఎస్ పార్టీకి 2-3 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని జోస్యం చెప్పాయి.
అదే జరిగితే కాంగ్రెస్, బీజేపీలు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని ఆకర్షించి ఆ పార్టీని ఖాళీ చేసే ప్రయత్నం చేయవచ్చు. లేదా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే ఆ రెండు పార్టీలలో ఏదో ఓ పార్టీలో చేరిపోయే అవకాశం ఉంది.
కనుక ఈరోజు కౌంటింగ్‌లో మూడు పార్టీలలో ప్రజలు దేనికి ఎన్ని ఎంపీ సీట్లు ఇచ్చారో తేలిపోతే రేపటి నుంచి తెలంగాణ రాజకీయాలలో మరో కొత్త అధ్యాయం మొదలవబోతోంది.
ఈరోజు ఉదయం 8 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ ప్రారంభం కాబోతోంది. లోక్‌సభ ఓట్లతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఓట్లు కూడా ఒకేసారి లెక్కించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ 175 స్థానాలకు, ఆ రాష్ట్రంలో 25 ఎంపీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు, అలాగే దేశవ్యాప్తంగా కూడా లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఒకేసారి మొదలుకాబోతోంది.
తెలంగాణలో కౌంటింగ్ సిబ్బంది ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాలలో తమతమ స్థానాలకు చేరుకుని ఓట్ల లెక్కింపుకి సిద్దంగా ఉన్నారు. ఆనవాయితీ ప్రకారం ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎం ఓట్లు లెక్కిస్తూ ఎప్పటికప్పుడు ఆధిక్యతలు, ఫలితాలు ప్రకటిస్తుంటారు. తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మధ్యాహ్నం 1-2 గంటలలోపే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.