మహబూబ్ నగర్ స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి నవీన్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. మొత్తం 1,437 ఓట్లు పోల్ అవగా వాటిలో 27 ఓట్లు చెల్లలేదు. మిగిలిన వాటిలో నవీన్ కుమార్ రెడ్డికి 763, కాంగ్రెస్ అభ్యర్ధి మన్నే జీవన్ రెడ్డికి 652 ఓట్లు, స్వతంత్ర అభ్యర్ధికి ఒక్క ఓటు వచ్చింది. దీంతో జీవన్ రెడ్డిపై 111 ఓట్లు తేడాతో తొలి ప్రాధాన్యత ఓట్లతోనే నవీన్ కుమార్ రెడ్డి గెలిచారు. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి నుంచి శాసనసభకు పోటీ చేసి ఎన్నికవడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అందువల్ల ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది.
లోక్‌సభ ఎన్నికలకు సంబందించి ఎగ్జిట్ పోల్స్ నివేదిక తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ముందు కాంగ్రెస్ పార్టీకి కానుకగా లభించగా, ఎగ్జిట్ పోల్స్ షాకులో ఉన్న బిఆర్ఎస్ నేతలకు ఈ చిన్న విజయం ఉపశమనం కలిగిస్తుంది.