అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో ఓట్ల లెక్కింపు షురూ

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4న చేపట్టబోతుండగా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజే జరుగుతోంది. ఆ రెండు రాష్ట్రాల శాసనసభ గడువు నేటితో ముగుస్తుండటంతో ఈరోజు ఉదయం 6 గంటల నుంచి ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రారంభం అయ్యింది. 

అరుణాచల్ ప్రదేశ్ శాసనసభలో 60, సిక్కిం శాసనసభలో 32 స్థానాలకు ఏప్రిల్‌ 19న ఎన్నికలు జరిగాయి. అయితే వాటి శాసనసభ పదవీ కాలం ముగుస్తున్నందున ఇదివరకే ఓట్ల లెక్కింపు చేపట్టే అవకాశం ఉన్నప్పటికీ, వాటి ఫలితాల ప్రభావం ఇతర రాష్ట్రాలలోని ఎన్నికలపై పడుతుందనే ఉద్దేశ్యంతో లోక్‌సభ ఎన్నికల చివరి దశ పోలింగ్‌ పూర్తయిన తర్వాత నేడు కౌంటింగ్‌ జరుగుతోంది. 

ఇప్పటివరకు పూర్తయిన ఓట్ల లెక్కింపులో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ 60కి 43 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతుండగా ఎన్‌పిపి:6, ఎన్‌సీపి (ఏపీ):4, ఇతరులు 5 సీట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 

సిక్కిం రాష్ట్రంలో 32 స్థానాలలో ఎస్‌కెఎం: 30, ఎస్‌డిఎఫ్: 1, బీజేపీ: 0 ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.