రేపు జూన్ 2న జరుగబోయే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ముఖ్య అతిధిగా రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. అందుకు ఆమె అంగీకరించారు కూడా. తెలంగాణ ఏర్పాటు చేసినందుకు రేపటి వేడుకలలో ఆమెను ఘనంగా సన్మానించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావించింది.
కానీ అనారోగ్య కారణాల వలన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు సోనియా గాంధీ హాజరు కాలేకపోవచ్చునని ఈరోజు ఉదయమే తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీ నుంచి ఫోన్ ద్వారా తెలియజేసిన్నట్లు సమాచారం. ఒకవేళ ఆమె రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు హాజరుకాలేని పక్షంలో ఓ వీడియో సందేశం రికార్డ్ చేసి పంపింవచ్చని తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ ఈ వార్తని ఇంకా ధృవీకరించాల్సి ఉంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మంత్రులతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్ళి రాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్‌ని రేపు ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరుగబోయే రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో పాల్గొనవలసిందిగా ఆహ్వానించారు. అందుకు గవర్నర్ సమ్మతించారు.
కనుక ఆయన సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ వేడుకలను నిర్వహించబోతోంది. రేపు సాయంత్రం టాంక్ బండ్ మీద పోలీసుల కవాతు అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, కళా ప్రదర్శనలు జరుగుతాయి.