ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత దేశవ్యాప్తంగా అన్ని మీడియా, సర్వే సంస్థలు సార్వత్రిక ఎన్నికలపై ఎగ్జిట్ పోల్ నివేదికలు ప్రకటించి, వాటిపై అధికార, ప్రతిపక్షాల నేతలతో విశ్లేషణలు చేస్తాయి. ఈసారి ఆ చర్చల్లో పాల్గొనకూడదని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి, మీడియా వ్యవహారాల కమిటీ ఛైర్మన్ పవన్ ఖేరా ట్విట్టర్ ద్వారా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతలకు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఇప్పటికే ఆరు విడతలలో సాగిన ఎన్నికల ప్రక్రియలో ప్రజల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. నేడు చివరి విడత తీర్పు కూడా ఈవీఎంలలో నిక్షిప్తం కాబోతోంది. ఆ తీర్పుని ఎవరూ మార్చలేరు.
న్యూస్ ఛానల్స్ తమ టిఆర్‌పి రేటింగ్ పెంచుకునేందుకు నిర్వహించే ఇటువంటి చర్చా కార్యక్రమాలతో ఫలితాల గురించి ఊహాగానాలు ప్రచారం అవుతాయే తప్ప మరే ప్రయోజనం ఉండదు. కనుక వాటిలో పాల్గొనకూడదని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.
కానీ జూన్ 4న ఫలితాలు వెలువడిన తర్వాత పార్టీల గెలుపోటములు స్పష్టమైపోతాయి కనుక అప్పుడు వాటిపై చర్చా కార్యక్రమాలలో కాంగ్రెస్ నేతలు తప్పక పాల్గొంటారు,” అని పవన్ ఖేరా చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయానికి బీజేపీ మరో విదమైన అర్దం చెప్పింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దీనిపై స్పందిస్తూ, “కాంగ్రెస్ పార్టీ అప్పుడే ఓటమిని అంగీకరించేసింది. ఓడిపోబోయే పార్టీలు ఈవిదంగా చర్చలకు దూరంగా ఉంటాయి. ఓడిపోయిన తర్వాత ఈసీని, ఈవీఎంలని నిందిస్తుంటాయి. కాంగ్రెస్ పార్టీ కూడా రేపు అదే చేయబోతోంది,” అని అన్నారు.