ప్రముఖ కవి అందెశ్రీ సుమారు 20 ఏళ్ళ క్రితం వ్రాసిన జయజయహే గీతాన్ని ఎటువంటి మార్పులు లేకుండా యధాతధంగా ఆమోదించామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గురువారం సచివాలయంలో మంత్రులు, తెలంగాణ ఉద్యమాలలో పాల్గొన్న ప్రతిపక్ష నేతలు, ఉద్యమ నేతలతో దీనిపై సమీక్ష సమావేశం జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.
సుమారు 13.30 నిమిషాల నిడివి గల పూర్తి గేయాన్ని రాష్ట్ర గీతంగా ఆమోదం తెలిపారు. దానిలో మూడు చరణాలను తీసుకొని కీరవాణి స్వరపరిచిన 2.30 నిమిషాల నిడివి గల గీతాన్ని కూడా రాష్ట్ర గీతంగా గుర్తించి అధికారిక కార్యక్రమాలలో ఆలపించేందుకు ఉపయోగించుకుంటామని చెప్పారు. సమావేశంలో పాల్గొన్నావారందరి ఆమోదంతో ఈ నిర్ణయం తీసుకున్నామని సిఎం రేవంత్ రెడ్డి మీడియాకు తెలియజేశారు.
జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు, దశాబ్ధి ముగింపు వేడుకలలో జయజయహే రాష్ట్ర గీతాన్నిజాతికి అంకితం చేస్తామని చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరుగబోయే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమానికి ప్రతిపక్ష నేతలు, ఉద్యమనేతలు, నాడు ఉద్యమాలలో పాల్గొన్న విద్యార్ధి సంఘాల నేతలను తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొనబోతున్నారు. సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో కలిసి నిన్న ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య ఇంటికి వెళ్ళి ఆయనకు శాలువా కప్పి సత్కరించి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో పాల్గొనవలసిందిగా ఆహ్వానించారు.