మాజీ ప్రధాని దేవగౌడ మనుమడు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను గురువారం అర్దరాత్రి కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన 2024లో లోక్ సభ ఎన్నికలలో ఎన్డీయే అభ్యర్ధిగా మళ్ళీ హాసన నియోజకవర్గం నుంచి బరిలో దిగారు కూడా.
అయితే పలువురు మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో, పోలీసులు అరెస్ట్ చేస్తారని పసిగట్టి ఆరు నెలల క్రితమే జర్మనీ పారిపోయి అప్పటి నుంచి అక్కడే ఉన్నారు.
దీంతో కర్ణాటక పోలీసులు ఆయనకు నాలుగు నోటీసులు, ఒక లుకవుట్ నోటీస్, ఒక అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఆయన విదేశాలలో ఎక్కడ ఉన్నా అరెస్ట్ చేసి భారత్కు రప్పించేందుకు ఆయనపై ఓ బ్లూకార్నర్, ఓ రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేశారు.
ఈ నేపధ్యంలో ఆయన తక్షణం భారత్ తిరిగి వచ్చి పోలీసులకు లొంగిపోకపోతే దౌత్య పాస్ పోర్టుని రద్దు చేస్తామని కేంద్ర విదేశాంగ శాఖ హెచ్చరించింది. తాత హెచ్డి దేవెగౌడ, తండ్రి హెచ్డి, చిన్నాన్న మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి ఒత్తిడి మేరకు ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీ నుంచి తిరిగి వచ్చారు.
ఆయన కోసమే కెంపగౌడ విమానాశ్రయంలో ఎదురుచూస్తున్న సిట్ పోలీస్ బృందం అక్కడే అరెస్ట్ చేసి సీఐడీ కార్యాలయానికి తరలించారు. ప్రజ్వల్ రేవణ్ణ ముందస్తు బెయిల్ పిటిషన్ను బెంగళూరులోని ప్రజా ప్రతినిధుల కోర్టు తిరస్కరించడంతో పోలీసులకు లొంగిపోక తప్పలేదు.