రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు టాంక్ బండ్ ముస్తాబు

జూన్ 2 సాయంత్రం హైదరాబాద్‌లో టాంక్ బండ్ మీద తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగబోతున్నాయి. ఈ వేడుకలలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యే, అధికార, ప్రతిపక్ష నేతలతో పాటు ప్రజలు కూడా పాల్గొనబోతున్నారు. 

తెలంగాణ ఏర్పడి పదేళ్ళు పూర్తయినందున ఈసారి మరింత ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కనుక జీహెచ్‌ఎంసీ అధికారుల పర్యవేక్షణలో టాంక్ బండ్‌ని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దుతున్నారు. 

ఈ వేడుకలకు వేలాదిగా సామాన్య ప్రజలు వస్తారు కనుక వారి కోసం టాంక్ బండ్‌పై 80 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. స్వయంసహాయక బృందాలు తయారు చేసిన చేనేత ఉత్పత్తులు, హస్త కళలు, బొమ్మలు, ఇంకా ఆహార పధార్ధాల స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. టాంక్ బండ్‌పై ఎక్కడికక్కడ త్రాగునీరు, సమీపంలోనే వైద్య శిబిరాలు, అంబులెన్సులు, అగ్నిమాపక యంత్రాలను కూడా సిద్దంగా ఉంచబోతున్నారు. వాహనాలు పార్కింగ్ చేయడానికి టాంక్ బండ్‌ ఇరువైపులా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. 

జూన్ 2న సాయంత్రం టాంక్ బండ్‌ మీద జరిగే రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో ముందుగా పోలీస్ బృందాలు కొత్తగా స్వరపరిచిన రాష్ట్ర గీతం ‘జయజయహే...’ని ఆలపిస్తూ కవాతు చేస్తారు. తర్వాత వివిద జిల్లాల నుంచి వచ్చిన కళాకారులు, సాంస్కృతిక బృందాలు ప్రదర్శనలు ఇస్తాయి. ఎప్పటిలాగే ఈసారి కూడా లేజర్ షో నిర్వహించే అవకాశం ఉంది.