ఫోన్ ట్యాపింగ్‌ కేసుపై రేవంత్‌ మౌనమేల? లక్ష్మణ్ ప్రశ్న

తెలంగాణలో కేసీఆర్‌ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారంలో అరెస్ట్అయిన పోలీస్ ఉన్నతాధికారులు బయటపెడుతున్న విషయాలు యావత్ దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు, భుజంగ రావు ముగ్గురూ కేసీఆర్‌ ఆదేశాల ప్రకారమే బిఆర్ఎస్ నేతలతో పాటు ప్రతిపక్ష పార్టీల నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసేవారిమని వాంగ్మూలంలో పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్, వ్యాపారస్తులు చివరికి న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయించారని వారు పేర్కొన్నారు.

బిఆర్ఎస్ ప్రత్యర్ధులను బెదిరించి లొంగదీసుకోవడమే కాకుండా వారి నుంచి భారీగా డబ్బు వసూలు చేసేవారిమని చెప్పారు. ఎన్నికల సమయంలో బిఆర్ఎస్ నేతల డబ్బుని పోలీస్ వాహనాలలోనే నియోజకవర్గాలకు చేర్చి అందించేవారిమని చెప్పారు. 

అరెస్ట్ అయిన పోలీస్ అధికారులు ఇన్ని సంచలన విషయాలు బయటపెడుతుంటే, సిఎం రేవంత్‌ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించించారు. కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగానే రేవంత్‌ రెడ్డి ఫోన్ ట్యాపింగ్‌ కేసు గురించి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతున్నారని లక్ష్మణ్ అనుమానం వ్యక్తం చేశారు.

ఒకవేళ ఈ కేసులో కేసీఆర్‌ని అరెస్ట్ చేసే ధైర్యం రేవంత్‌ రెడ్డికి లేకపోతే ఈ కేసుని తక్షణం సీబీఐకి అప్పగించిన్నట్లయితే, ఆయన కూతురు కల్వకుంట్ల కవితని అరెస్ట్ చేసిన్నట్లు ఆయనను కూడా అరెస్ట్ చేస్తారని లక్ష్మణ్ సలహా ఇచ్చారు.