రేపే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక... అన్ని ఏర్పాట్లు పూర్తి

ఉమ్మడి వరంగల్‌-నల్గొండ-ఖమ్మం పట్టభద్ర నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్‌ సోమవారం జరుగబోతోంది. దీని కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. రేపు ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. అయితే ఫలితాలు ఇప్పుడు వెలువడవు. జూన్ 4న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మర్నాడు అంటే 5వ తేదీన ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. 

ఈ మూడు ఉమ్మడి జిల్లాలలోని 34 శాసనసభ నియోజకవర్గాలలో మొత్తం 4,63,839 పట్టభద్ర ఓటర్లు ఉన్నారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అత్యధికంగా 1,73,406 మంది, ఆ తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లాలో 1,66,448 మంది, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1,23,985 పట్టభద్ర ఓటర్లు ఉన్నారు. వారి కోసం 605 పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేసింది.   

బిఆర్ఎస్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక జరుగుతోంది.  

కాంగ్రెస్‌ అభ్యర్ధిగా తీన్మార్ మల్లన్న, బీజేపీ అభ్యర్ధిగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బిఆర్ఎస్‌ అభ్యర్ధిగా ఏనుగు రాకేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. వీరు కాక మరో 49 మంది అభ్యర్ధులు ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్నారు. రేపు పోలింగ్‌ జరుగబోతున్నందున ఈ మూడు ఉమ్మడి జిల్లాలలో రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది.