జూన్ 2వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగబోతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్ళు పూర్తయిన ఈ సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున ఈసారి వేడుకలు గత వేడుకలకు పూర్తి భిన్నంగా జరుగబోతున్నాయి.
ఇంతకాలం బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు కేసీఆర్ ఒక్కరే పోరాడి తెలంగాణ రాష్ట్రం సాధించిన్నట్లు ప్రచారం చేసుకునేవారు తప్ప ఉద్యమాలలో పాల్గొన్న అనేక పార్టీలు, వాటి నేతలు, అనేక విద్యార్ధి, ఉద్యోగ, కార్మిక సంఘాలకు, ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవ్వలేదు. కనీసం రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ఆహ్వానించేవారు కాదు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో కూడా కేసీఆర్ ఒక్కరికే ప్రాధాన్యం లభిస్తుండేది. కానీ ఈసారి వేడుకలలో నాడు తెలంగాణ ఉద్యమాలలో పాల్గొన్న ప్రొఫెసర్ కోదండరామ్ వంటి ఉద్యమకారులని, ఉద్యమాలలో పాల్గొన్న రాజకీయ పార్టీల నేతలందరినీ పాల్గొనవలసిందిగా సిఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.
కానీ ఈసారి వేడుకలో నాడు ఉద్యమాలలో పాల్గొన్నవారందరినీ పేరుపేరునా ఆహ్వానించబోతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కి కూడా ఆహ్వానం పంపించనున్నారు.
శనివారం సచివాలయంలో జరిగిన సమావేశంలో టిజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, విశ్వేశ్వర్‌రావు, సిపిఐ, సీపీఎం పార్టీల నేతలు కూనంనేని సాంబశివరావు, ఎస్.వీరయ్య, పల్లా వెంకట్‌రెడ్డి, జూలకంటి రంగారెడ్డి, కాంగ్రెస్ నేతలు మహేష్ కుమార్‌గౌడ్, మల్లు రవి పాల్గొన్నారు. వారు ఈ వేడుకల నిర్వహణకు సిఎం రేవంత్ రెడ్డికి కొన్ని సూచనలు చేశారు.
ఈ వేడుకలలో సోనియా గాంధీ ముఖ్య అతిధిగా పాల్గొన వలసిందిగా ఆహ్వానించేందుకు సిఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళబోతున్నారు. తెలంగాణ ఏర్పడిన పదేళ్ళకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక తెలంగాణ ఏర్పాటు చేసినందుకు ఈ వేడుకలో ఆమెను ఘనంగా సన్మానించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది.