రేవంత్‌పై బీజేపీ పిటిషన్‌... అర్దరాత్రి హైకోర్టు విచారణ

తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డికి వ్యతిరేకంగా బీజేపీ నేత వేసిన ఓ పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం అర్దరాత్రి విచారణ చేపట్టింది.

కేంద్రంలో బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్స్ రద్దు చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారంటూ సిఎం రేవంత్‌ రెడ్డి ఎన్నికల సమయంలో దుష్ప్రచారం చేశారని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు నాంపల్లి క్రిమినల్ కోర్టులో ఓ ప్రైవేట్ పిటిషన్‌ వేశారు.

కానీ నాంపల్లి కోర్టు దానిపై విచారణ జరపకుండా వాయిదా వేసింది. తమ పిటిషన్‌పై తక్షణం విచారణ చేపట్టాలని నాంపల్లి కోర్టుని ఆదేశించాలని కోరుతూ కాసం వెంకటేశ్వర్లు హైకోర్టులో క్వాస్ పిటిషన్‌ వేశారు.   

హైకోర్టు వెకేషన్ బెంచ్ వద్ద ఉన్న ఇతర కేసులన్నీ విచారణ పూర్తయ్యేసరికి శుక్రవారం అర్దరాత్రి అయ్యింది. రాత్రి ఒంటి గంటకు కాసం వెంకటేశ్వర్లు దాఖలు చేసిన పిటిషన్‌పై వెకేషన్ బెంచ్ సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్ సేన్‌ రెడ్డి ఆ విచారణ చేపట్టారు. 

పిటిషనర్ తరపున న్యాయవాది దేవినేని హంస వాదిస్తూ నాంపల్లి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసి 45 రోజులు గడుస్తున్నా విచారణ చేపట్టకపోవడం వలననే హైకోర్టుని ఆశ్రయించవలసి వచ్చిందని, కనుక విచారణ చేపట్టవలసిందిగా నాంపల్లి కోర్టుని ఆదేశించాలని కోరారు.

అయితే ఈ కేసు అర్దరాత్రి ఒంటి గంటకు విచారించాల్సినంత అత్యవసరమైనదేమీ కాదని చెపుతూ వాయిదా వేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ కేసుకి సంబందించి పూర్తి వివరాలు అందజేయాలని పిటిషనర్ తరపు న్యాయవాదిని ఆదేశించారు.