
తెలంగాణాలో బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నంతకాలం ఆ పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన భూకబ్జాల భాగోతాలు బయటపడకుండా దాచగాలిగారు. కానీ ప్రభుత్వం మారిన తర్వాత వారి భాగోతాలన్నీ ఒకటొకటిగా బయటపడుతున్నాయి.
మాజీ మంత్రి, బిఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తాజాగా మరో భూవివాదంలో చిక్కుకున్నారు. రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండలం బొమ్మరాసిపేట గ్రామం పరిధిలో గల పెద్ద చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లో సర్వే నంబర్ 408లో సుమారు రెండేళ్ల క్రితం ఆరు ఎకరాల పట్టాభూమికి అగ్రిమెంట్ చేసుకొని, ఏడాది క్రితం తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుని దాని చుట్టూ ప్రహారీ గోడ నిర్మించుకున్నారు.
అయితే నిబంధనల ప్రకారం ఎఫ్టీఎల్, బఫర్ జోన్‌లో ఎటువంటి నిర్మాణాలు చేయరాదనే విషయాన్ని మల్లారెడ్డి పట్టించుకోలేదు. అప్పటికీ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉండటం, దానిలో ఆయన మంత్రిగా ఉండటం వలన ఇటువంటి నిబంధనలు తనకు వర్తించవని ఆయన భావించిన్నట్లున్నారు.
అప్పుడు ఆయన అధికారంలో ఉన్నందున అధికారులతో సహా ఎవరూ ధైర్యం చేసి ఆయనను అడ్డుకోలేకపోయారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బొమ్మరాసిపేట గ్రామ ప్రజలే ఆయనపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
ఆయన, నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి శుక్రవారం ఉదయం క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత మల్లారెడ్డి భూమి చుట్టూ నిర్మించిన ప్రహారీ గోడని కూల్చేయాలని ఆదేశించారు. ఆయన సమక్షంలోనే సిబ్బంది ప్రహారీ గోడని కూల్చేశారు.
నగర శివారులో మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డికి చెందిన ఇంజనీరింగ్ కాలేజీని భూకబ్జా చేసి అక్రమంగా నిర్మించారంటూ లోక్‌సభ ఎన్నికలకు ముందే అధికారులు పాక్షికంగా కూల్చేశారు.
ఇటీవలే సుచిత్ర చౌరస్తా వద్ద ఓ భూవివాదంలో మల్లారెడ్డి తన అనుచరులతో వచ్చి చాలా హడావుడి చేశారు. కోర్టులో ఆ కేసు నడుస్తోంది. తాజాగా ఈ వివాదంలో చిక్కుకున్నారు.
దీనిపై మల్లారెడ్డి ఏవిధంగా స్పందిస్తారో ఊహించుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తనపై రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతూ వేదిస్తోందని ఆరోపించడం ఖాయమే.