బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై చేవెళ్ళ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. దామోదర్ రెడ్డి అనే వ్యక్తి 2022లో ఎర్లపల్లిలో 20.20 ఎకరాల భూమిని కొనుగోలు చేసి దానిలో ఓ ఫంక్షన్ హాల్ నిర్మించుకున్నారు. దాని పక్కనే జీవన్ రెడ్డికి చెందిన స్థలం ఉండటంతో ఆయన తన ఫంక్షన్ హాల్ కూల్పించేసి సర్వే నంబర్ 32,35,36,38లో గల తన స్థలాన్ని ఆక్రమించుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తన స్థలం ఆక్రమించుకొని కొందరు గూండాలను దానికి కాపలాగా పెట్టి వారి చేత తనను బెదిరిస్తున్నారని దామోదర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అయితే ఇదివరకు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున, దానిలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నందున ఫిర్యాదు చేయడానికి సాహసించలేకపోయానని దామోదర్ రెడ్డి చెప్పారు.
ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా కూడా లేరు కనుక ధైర్యం చేసి ఫిర్యాదు చేస్తున్నానని, కానీ జీవన్ రెడ్డి, గ్యాంగ్ నుంచి తన ప్రాణాలకు ప్రమాదం ఉందని పిర్యాదులో పేర్కొన్నారు.
కనుక తనకు రక్షణ కల్పించి జీవన్ రెడ్డి అధీనంలో ఉన్న తన భూమిని తిరిగి ఇప్పించాలని దామోదర్ రెడ్డి కోరారు. ఆయన ఫిర్యాదు మేరకు చేవెళ్ళ పోలీసులు జీవన్ రెడ్డిపై సెక్షన్స్ 447, 427, 341, 386, 420, 506 (34) కింద కేసు నమోదు చేశారు.
ఆర్మూరులో టిఎస్‌ఆర్టీసీకి చెందిన స్థలం లీజుకి తీసుకొని దానిలో షాపింగ్ మాల్ నిర్మించుకున్నారు. దాని లీజు బకాయిలు రూ.7.20 కోట్లు చెల్లించనందుకు ఇటీవలే టిఎస్‌ఆర్టీసీ ఆ షాపింగ్ మాల్‌ని స్వాధీనం చేసుకుంది. ఆ వివాదం కొనసాగుతుండగానే కొత్తగా ఈ భూకబ్జా భాగోతం కూడా బయటపడింది.