తెలంగాణ అవతరణ దినోత్సవాలకు ఈసీ అనుమతి

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ ముగిసినప్పటికీ జూన్ 5వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది. కనుక జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం ఈసీ నుంచి అనుమతి తీసుకోవలసి వచ్చింది. అయితే ఈసీ ఎటువంటి అభ్యంతరాలు, ఆంక్షలు విధించకుండా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలు నిర్వహించుకునేందుకు అనుమతించింది. 

జూన్ 2వ తేదీన సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో ఈ వేడుకలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సంబందిత శాఖల అధిపతులను ఆదేశాలు జారీ చేశారు. ఆ రోజు సిఎం రేవంత్‌ రెడ్డి మంత్రులతో కలిసి గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించిన తర్వాత, అక్కడి నుంచి నేరుగా పరేడ్ గ్రౌండ్స్‌ చేరుకుంటారు. 

ఈసారి వేడుకకు సోనియా గాంధీ ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. తెలంగాణ ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతగా రాష్ట్ర ప్రజల తరపున సిఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు ఆమెను ఘనంగా సన్మానించబోతున్నట్లు సమాచారం.

తెలంగాణ వేడుకలలో పాల్గొనవలసిందిగా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌తో సహా అన్ని పార్టీల నేతలకు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వాన పత్రాలు పంపబోతోంది. ఒకవేళ కేసీఆర్‌ హాజరైతే తెలంగాణ కోసం పొరాడి సాధించినందుకు ఆయనను కూడా రాష్ట్ర ప్రభుత్వం సత్కరించాలని భావిస్తున్నట్లు సమాచారం.