లిక్కర్ కేసులో ఈడీ రెడీగా ఉంది కానీ సీబీఐ లేదట!

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కల్వకుంట్ల కవిత బెయిల్‌ పిటిషన్‌పై నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఆమె పిటిషన్‌పై ఈడీ వాదనలు వినిపించేందుకు సిద్దంగా ఉందని తెలియజేస్తూ ఈడీ తరపు న్యాయవాది కౌంటర్ దాఖలు చేశారు.

అయితే సీబీఐ మాత్రం తమకు మరో మూడు రోజులు సమయం కావాలని కోరింది. ఈ కేసులో ఈడీ ఇప్పటికే కల్వకుంట్ల కవితపై ఛార్జ్-షీట్‌ దాఖలు చేసింది. కానీ సీబీఐ ఛార్జ్-షీట్‌ దాఖలు చేయడానికి కూడా కొంత సమయం కోరింది. 

ఆమె బెయిల్‌ పిటిషన్‌పై ఈ నెల 27న కౌంటర్ దాఖలు చేస్తామని, జూన్ 7న ఛార్జ్-షీట్‌ దాఖలు చేస్తామని సీబీఐ తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. కనుక కల్వకుంట్ల కవిత బెయిల్‌ పిటిషన్‌పై తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేస్తూ ఆరోజు ఆమె తరపు వాదనలు వింటామని న్యాయమూర్తి చెప్పారు.

మంగళవారం ఈడీ, సీబీఐల వాదనలు విన్న తర్వాత బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు చెపుతామన్నారు. బహుశః జూన్ 4న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఈ బెయిల్‌ ఎపిసోడ్ కొనసాగే అవకాశం కనిపిస్తోంది.