కవిత బెయిల్‌ పిటిషన్‌పై నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ

కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయ్యి రెండు నెలలు పైనే అయ్యింది. అప్పటి నుంచి ఆమె ఢిల్లీలోని తిహార్ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉంటున్నారు. బెయిల్‌ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ రౌస్ అవెన్యూ కోర్టు ఆమె బెయిల్‌ పిటిషన్లన్నీ తిరస్కరించడంతో ఆమె ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు.

ఆమె బెయిల్‌ పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు విచారణ జరుపనుంది. ఆమెకు హైకోర్టులో కూడా బెయిల్‌ మంజూరు కాకపోతే ఇక చివరి ప్రయత్నంగా సుప్రీంకోర్టుని ఆశ్రయించాల్సి ఉంటుంది. అక్కడ కూడా వెంటనే విచారణ జరిగి బెయిల్‌ మంజూరు అవుతుందనే నమ్మకం లేదు. కనుక నేడు ఢిల్లీ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేస్తే కల్వకుంట్ల కవిత ఇంటికి చేరుకోగలుగుతారు 

ఈ కేసులో ఆమెను ప్రశ్నించడం పూర్తయిందని చెపుతూ ఈడీ చెపుతోంది. కానీ ఆమెకు బెయిల్‌ మంజూరు చేయడాన్ని ఈడీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ కేసులో ఈడీ ఆమెపై ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది.

కనుక నేడు హైకోర్టులో మళ్ళీ ఈడీ ఇదే విదంగా వాదించవచ్చు. ఈ కేసులో కల్వకుంట్ల కవితని ప్రశ్నించడానికి ఏమీ లేనప్పుడు ఇంకా జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉంచాల్సిన అవసరం ఏమిటి? అని హైకోర్టు భావిస్తే బెయిల్‌ మంజూరు కావచ్చు లేకుంటే మరో నెల రోజులైనా జైల్లో ఉండక తప్పక పోవచ్చు. మరికొన్ని గంటలలో కల్వకుంట్ల కవితకు బెయిల్‌ లభిస్తుందో లేదో తేలిపోతుంది.