
సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణకు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లతో సత్సంబంధాలు ఉన్నాయి. కనుక వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆ పార్టీ అభ్యర్ధి ఏనుగుల రాకేష్ రెడ్డికి మద్దతు పలికారు. మూడు జిల్లాలలో పట్టభద్రులు అందరూ ఉన్నత విద్యావంతుడైన ఏనుగుల రాకేష్‌కే ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఏనుగుల రాకేష్ రెడ్డి ఇంతకాలం బీజేపీలో ఉండేవారు. శాసనసభ ఎన్నికలలో వరంగల్ నుంచి పోటీ చేయాలనుకున్నారు. కానీ బీజేపీ ఆయనకు టికెట్ ఇవ్వకపోవడంతో బిఆర్ఎస్ పార్టీలో చేరి ఇప్పుడు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా తీన్మార్ మల్లన్న, బీజేపీ అభ్యర్ధిగా గుజ్జల ప్రేమేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు.
ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్సీగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్ రెడ్డి శాసనసభ ఎన్నికలలో జనగామ నుంచి పోటీ చేసి గెలవడంతో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినందున ఈ ఉప ఎన్నిక జరుగుతోంది.
ఈ నెల 27వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. జూన్ 5వ తేదీన ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.