ఏపీలో అల్లర్లు, విధ్వంసం... పోలీస్ అధికారులపై ఈసీ వేటు!

ఏపీ శాసనసభ ఎన్నికలు అధికార వైసీపికి, అటు ప్రతిపక్ష కూటమికి రెంటి మనుగడకు చాలా కీలకంగా మారడంతో ఈసారి పోలింగ్‌ తీవ్ర ఉద్రిక్త వాతావరణం మద్య సాగింది. హైదరాబాద్‌తో సహా దేశ విదేశాలలో స్థిరపడిన ఆంధ్రా ప్రజలు కూడా ఏపీలో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఈసారి ఏపీలో 81.76 శాతం పోలింగ్‌ నమోదు అయ్యింది. 

ఈ పోలింగ్‌ సరళి చూసిన వైసీపి నేతలు తమ ఓటమి ఖాయమని పసిగట్టి ప్రతిపక్షాలపై దాడులు చేశారు. తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం, గుంటూరు, పల్నాడు జిల్లాలో పోలింగ్‌ తర్వాత అల్లర్లు, దాడులు జరిగాయి.

ఎన్నికల ప్రచార సమయంలోనే ఏపీలో పలువురు పోలీస్ అధికారులు అధికార వైసీపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నందుకు, ఈసీ ఆ రాష్ట్ర డిజిపితో సహా పలువురు ఎస్పీ, సీఐ, ఎస్సైలపై వేటు వేసింది.

అయినా పోలింగ్‌ తర్వాత కూడా మళ్ళీ అల్లర్లు జరగడంతో డిజిపి హరీష్ కుమార్‌ గుప్తా, సీఎస్ జవహార్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించుకుని వివరణ కోరింది. 

అనంతరం పల్నాడు జిల్లా కలెక్టర్, ఎస్పీ, అనంతపురం ఎస్పీలతో సహా మరో డజను మందిపై ఈసీ వేటు వేసింది.

జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కూడా ఏపీలో మళ్ళీ అల్లర్లు చెలరేగే ప్రమాదం పొంచి ఉందని భావించిన ఈసీ, జూన్ 4 నుంచి రెండు వారాల పాటు 25 కంపెనీల కేంద్ర బలగాలను రాష్ట్రంలో మోహరించి ఉంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏపీలో ఇప్పటివరకు అనేక ఎన్నికలు జరిగాయి కానీ ఇంత అరాచక పరిస్థితులు మునుపెన్నడూ లేవు.